203జీవోని రద్దు చేయాలి
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203జీవోని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ప్రతిరోజూ 3టీఎంసీల నీటిని తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం జీవోనుని జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడీ జీవోకి వ్యతిరేకంగా పోరాడేందుకు తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు రెడీ అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 203 జీవోను వెంటనే రద్దు చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి.. 203 జీవో వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. ఏపీ తమ వాటా కంటే 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించడం కోసం..రూ.7 వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసి 5న పరిపాలన అనుమతులు ఇచ్చిందన్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
మరోవైపు కృష్ణా నదీ జలాల పరిరక్షణ, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్‌తో సమావేశమైన కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పలు అంశాలు చర్చించారు. ఏపీలోని జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీఓ 203 అమలైతే శ్రీశైలం ఖాళీ అవుతుందని కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. 1990 కల్వకుర్తి కోసం జరిగిన తరహాలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కూడా 203జీవోని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.