కేసీఆర్ ఇంటిచుట్టు తిరుగుతున్న షీ-టీమ్స్.. !!

బంగారు తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌లేదంటూ బీజేపీ మ‌హిళామోర్చా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించింది. షీ టీమ్స్ కేసీఆర్ ఇంటి చుట్టే తిరుగుతున్నాయ‌ని ఆరోపించింది. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడులు , పెరుగుతున్ అభ‌ద్ర‌తాభావంపై బీజేపీ మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు ఆకుల విజ‌య ప్ర‌భుత్వంపై దుమ్మెత్తిపోశారు.

కేసీఆర్ ప్రభుత్వం మహిళలను అగౌర పరుస్తుందని ఆమె అన్నారు. మహిళా సంక్షేమ శాఖ కు మహిళా మంత్రి లేకపోవడం సిగ్గుచేటని, ఆ శాఖ‌కు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మహిళనా అంటూ ఆమె ప్ర‌శ్నించారు. రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరుగుతూనే ఉన్నా, ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారామె.

వెంట‌నే మహిళా కమీషన్ వేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. అమెరికా బొమ్మ ఇవాంక కు అంత సెక్యూరిటీ పెట్టిన ప్ర‌భుత్వం, తెలంగాణ ఆడపడుచులు మీద ఎందుకు చిన్న చూపు చూస్తొంద‌ని ప్ర‌శ్నించారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుంద‌ని ఆమె తెలిపారు.