తెలంగాణలో ‘లాక్ డౌన్ 5.O’ ఎలా ఉండబోతుందంటే ?
కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్రం ప్రభుత్వం కంటే మిన్నగా కరోనాని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిసారి కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ రోజులని మించి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే దేశంలో, తెలంగాణలోనూ ఈ నెల 31తో ‘లాక్ డౌన్ 4.ఓ ముగియనుంది. మరీ.. ఆ తర్వాత కూడా తెలంగాణలో లాక్ డౌన్ పొడగిస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది.
ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడగింపు, లాక్ డౌన్ సడలింపులపై చర్చించనున్నారు. రాష్ట్రంలో రోజురోజూకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులు లాక్ డౌన్ ని పొడగించాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో భారీ సడలింపులు ఇవ్వనుంది.
ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జూన్ నుంచి సినిమా షూటింగ్స్ మొదలుకానున్నాయి. అయితే రాత్రిపూట కర్ఫ్యూని కంటిన్యూ చేయనున్నారు. విద్యా సంస్థలు, థియేటర్స్ , ప్రార్థనా మందిరాలు, సభలు, సమావేశాలపై మాత్రం ఆంక్షలు కొనసాంచనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు వ్యవసాయ విధానంపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. బహుశా.. ఈరోజు రాత్రికి సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఉండవచ్చని తెలుస్తోంది.