సీఎం జగన్’కు టాలీవుడ్ రిక్వెస్ట్
రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకే సినీ పరిశ్రమ. రాష్ట్ర విభజన తర్వాత కూడా టాలీవుడ్ విడిపోలేదు. హైదరాబాద్ కేంద్రంగానే తెలుగు సినీ పరిశ్రమ పనిచేస్తోంది. అయితే టాలీవుడ్ ని ఏపీకి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా వినిపిస్తుంటాయ్. చంద్రబాబు హయాంలో ఆ దిశగా ప్రయత్నాలు జరగని చెబుతుంటారు.
ఇప్పుడు సీఎం జగన్ కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా ? అంటే.. లేదని చెప్పలేం. జీవో నెం.45 ద్వారా ఆంధ్రప్రదేశ్లో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వానికి చెందిన ప్రాంగణాలను ఉచితంగా అందిస్తున్నట్లు సీఎం జగన్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాతల మండలి సీఎం జగన్ కి లేఖ రాసింది. ఏపీలో చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టూడియోలు, ల్యాబ్స్, అలాగే నిర్మాతలకు, ఆర్టిస్టులకు, ఇతర పరిశ్రమ వర్గాలకు హౌసింగ్ కొరకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని లేఖలో కోరారు.
చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు తరలివచ్చిన సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలు నిర్మించుకోవడానికి, ల్యాబ్స్ కట్టుకోవడానికి స్ధలాలు ఉదారంగా కేటాయించారని, అలాగే నిర్మాతలు, ఆర్టిస్టుల హౌసింగ్ కొరకు కూడా స్ధలాలు ఇచ్చారని వారు గుర్తు చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అలాంటి సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ ని కోరారు.