హమ్మయ్యా.. చిరుత చిక్కింది !
ఎట్టకేలకి చిరుత చిక్కింది. రాజపేట తండా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. నల్లగొండ మర్రిగూడ మండలం రాజపేట తండా సమీపంలో చిరుత హడలెత్తించింది. రైతులు, ఫారెస్ట్ అధికారులపై దాడి చేసింది. అయితే ఫైనల్ గా ఫారెస్ట్ అధికారులు చిరుతని బంధించారు. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ కి తరలించారు. అయితే అంత ఈజీగా చిరుత చిక్కలేదు.
రాజపేట తండా సవిూపంలోని ఓ రైతు తన పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కంచెలో చిరుత పులి చిక్కుకుంది. ఉచ్చులో ఉన్న చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు మత్తు మందు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చిరుత ఒక్కసారిగా ఫారెస్టు సిబ్బంది పైకి దూకి అందరిని హడలెత్తించింది. వారిని ఉరుకులు పరుగులు పెట్టించింది.
సిబ్బందిపై దాడి చేసిన అనంతరం చిరుత అక్కడున్న ఫారెస్టు అధికారుల వాహనం కిందకు వెళ్లింది. అప్రమత్తమైన సిబ్బంది, పోలీసులు.. మరో వలను జీపుపై నుంచి చిరుత కవర్ అయ్యేలా వేశారు. అటవీశాఖ అంబులెన్స్‌లో ఉన్న ఫారెస్టు సిబ్బంది.. నెమ్మదిగా చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. చిరుత స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత చిరుతను బోనులోకి లాగారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌కు తరలించారు.