కన్నా ఇంట్లో విషాదం
ఏపీ భాజాపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కోడలు సుహారిక (38) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కన్నా లక్ష్మీనారాయణ రెండో కుమారుడు ఫణీంద్ర భార్య సుహారిక. వీరిది ప్రేమవివాహం. ఆమె స్వస్థలం నెల్లూరు.
పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాస్ లో ఉంటున్న సుహారిక గురువారం ఉదయం స్థానిక మీనాక్షి బాంబూస్ లోని మిత్రుడు పవన్ రెడ్డి ఇంటికెళ్లారు. అక్కడ వికాస్, వివాస్, ప్రవీణ్ (సుహారిక సోదరి భర్త) తదితరులు కలిసి విందు చేసుకున్నారు. సరిగ్గా రాత్రి 11.30 గంటలకు ఉన్నట్లుండి సుహారిక కుప్పకూలడంతో వెంటనే ఆమెను రాయదుర్గంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తేల్చారు.
సుహారిక తల్లి సాగరిక ఫిర్యాదు చేయడంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక కోడలు మరణ వార్త తెలియగానే కనా హుఠాహుఠిన గుంటూరు నుంచి హైదరాబాద్ కి బయలుదేరి వచ్చారు.