‘సాహో’ దర్శకుడి పెళ్లి ఫిక్స్

లాక్‌డౌన్ పెళ్లిళ్ల జాబితా పెరుగుతోంది. యంగ్ హీరో నిఖిల్ లాక్‌డౌన్ లోనే ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసి పల్లవి వర్మని పెళ్లాడాడు. నిఖిల్ పెళ్లి వేడుక చాలా సింపుల్ గా జరిగింది.  ఈ లాక్‌డౌన్ టైంలోనే నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న యంగ్ హీరో నితిన్ పెళ్లి కూడా త్వరలోనే జరగనుంది.

సాహో దర్శకుడు సుజీత్ పెళ్లి కూడా ఫిక్సయింది. సుజీత్ తన ప్రేయసి ప్రవల్లికతో జూన్ 10న నిశ్చితార్ధం జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుక జరిగిన కొద్ది రోజులకే పెళ్ళి పీటలు కూడా ఎక్కనున్నారు. ప్రవల్లిక వృత్తి రీత్యా డాక్టర్ కాగా, ఆమె టిక్ టాక్ వీడియోలలో బాగా ఫేమస్ అట. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోనున్నారని తెలిసింది. 

‘రన్ రాజా రన్’తో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నాడు సుజీత్. ఆ వెంటనే నక్కతోక తొక్కినట్టు ప్రభాస్ సినిమా ఛాన్స్ కొట్టేశాడు. అది కూడా ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా ‘సాహో’. అయితే సాహో ఆశించిన స్థాయిలో ఆడకపోవడం సుజీత్ ని నిరాశపరిచింది. అయినా.. సుజీత్ మెగా ఆఫర్ కొట్టేయడం విశేషం. ‘లూసిఫర్’ రిమేక్ బాధ్యతలని సుజీత్ కి అప్పగించారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఈ రిమేక్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు సుజీన్.