థియేటర్స్ ఓపెన్.. కేంద్రం కీలక ప్రకటన !

కరోనా లాక్‌డౌన్ తో షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయ్యాయ్. ఈ నెలలోనే షూటింగ్స్ చేసుకోవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అదే సమయంలో లాక్‌డౌన్‌‌నిబంధనలని పాటించాలని సూచిస్తున్నాయి. మరోవైపు థియేటర్స్ తెరచుకొనేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఝప్తులు అందుతున్నాయి. తాజాగా ఈ విజ్ఝప్తులపై కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ స్పందించారు. థియేటర్స్  తెరిచే అంశాన్ని జూన్‌ తర్వాత మాత్రమే పరిశీలిస్తామని ఆయన అన్నారు.

జూన్‌ నెలకు సంబంధించి కరోనా కేసుల సంఖ్యను, పరిస్థితిని పరిశీలించిన అనంతరం మాత్రమే సినిమా హాళ్లను ఎప్పుడు తెరిచేదీ నిర్ణయిస్తామని జయదేవకర్ అన్నారు. కేంద్రం దశలవారీగా సడలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో కరోనా అన్‌లాక్‌-1 కు సంబంధించి మార్గదర్శకాలను హోంశాఖ ఇటీవల ప్రకటించింది. దీనిలో భాగంగా… ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైనవి తెరిచేందుకు అనుమతి నిచ్చింది.  షాపింగ్‌ మాల్స్‌ జూన్‌ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక సినిమా హాళ్లు, థియేటర్లు, ఈతకొలనులు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, బార్లు, సమావేశమందిరాలు తదితర అంశాలపై తదుపరి నిర్ణయం ఉంటుందని ఆయన అన్నారు.