ఫస్ట్ ఛాన్స్ ‘మాస్టర్’కు ఇవ్వొద్దట
ప్రేక్షకులని తిరిగి థియేటర్స్ కి తీసుకొచ్చే బాధ్యతని విజయ్ పై పెట్టింది కోలీవుడ్. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకి అనుమతినిచ్చింది. మరోవైపు సామాజిక దూరం, ఇతర నిబంధనలను పాటిస్తూ జులై నుంచి థియేటర్లు పునఃప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతివ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో థియేటర్లు ఓపెన్ కాగానే మొదటి చిత్రంగా ‘మాస్టర్’ విడుదల చేయాలని థియేటర్ యజమానులు భావిస్తున్నారు. ‘మాస్టర్’ ప్రదర్శనతో థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడతాయని భావిస్తున్నారు. అయితే మాస్టర్ కు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వొద్దని ప్రభుత్వానికి లేఖ రాశారు సీనియర్ దర్శకుడు, నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు కేయార్. అది కూడా విజయ్ పై ఉన్న కోపంతో కాదు. ఆయనపై ఉన్న ప్రేమతోనే ఈ లేఖ రాశారు.
థియేటర్లు పునఃప్రారంభమైన వెంటనే మొదటిగా ‘మాస్టర్’ చిత్రాన్ని ప్రదర్శించడానికి అనుమతివ్వవద్దని కేయార్ కోరారు. ఆ చిత్రాన్ని విడుదల చేస్తే ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, దానివల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశముందని, అదే జరిగితే విజయ్‌కి ఉన్న మంచిపేరు పోతుందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ కంటే ముందు ప్రజల సంక్షేమం ముఖ్యమని ఆయన తెలిపారు. ‘ఖైదీ’ ఫేమ్ లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో మాస్టర్ తెరకెక్కింది. అనిరుధ్ స్వరాలు అందించారు.