రైతుబంధు అనుమానాలకి చెక్ పెట్టిన కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత పంటసాగు విధానాన్ని అమలు చేయాలనే ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్పిన పంటలు మాత్రమే పండించాలి. వారికి మాత్రమే రైతుబంధు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా రైతుల అనుమానాలపై మంత్రి కేటీఆర్ స్పష్టతనిచ్చారు.
రంగనాయకసాగర్ నుంచి ముస్తాబాద్ మండలానికి గోదావరి జిలాలు చేరుకున్న సందర్భంగా బదనకల్ చెరువు వద్ద గోదావరి జలాలకు మంత్రి కేటీఆర్ హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. రైతు బంధు పథకం కింద గతంలో వచ్చినంత సొమ్ము ఈ ఏడాది కూడా రైతులకు అందుతుందని స్పష్టం చేశారు. రైతుల బాగు కోసం సూచించిన పంటలసాగుపై కొందరు విమర్శలు చేయడం తగదన్నారు. మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలను పండించాలనే ఉద్దేశ్యంతోనే నియంత్రిత పంటలసాగును సీఎం సూచిస్తున్నారని తెలిపారు.