సామాన్యులకి శ్రీవారి దర్శనం.. ప్రారంభం !


కరోనా మహమ్మారి దేవుళ్లని వదిలిపెట్టలేదు. కరోనా ఎఫెక్ట్ తో దేవాలయాలన్నీ మూతపడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా గత 80రోజులుగా మూతపడింది. అయితే లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా జూన్‌ 8 నుంచి మూడు రోజుల పాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించిన తితిదే.. లోటుపాట్లను పరిశీలించి ఇవాళ్టి నుంచి టికెట్లు కలిగిన భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తోంది. దీంతో తిరుమలలో తిరిగి సందడి మొదలైంది.

మూడువేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, మరో మూడు వేల మందికి ఉచిత టైంస్లాట్‌ టోకెన్లు అందించింది. టికెట్లు పొందిన వారిని మాత్రమే అధికారులు కొండపైకి అనుమతిస్తున్నారు. మరోవైపు సాధారణ భక్తులతోపాటు వీఐపీలకు కూడా స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. వీఐపీ టికెట్లు పొందిన పలువురు ప్రముఖులు ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామన్నారు. భౌతికదూరం, పరిశుభ్రత పాటించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.