జగన్’ని కంట్రోల్ చేసేది ఒకే ఒక్కడు
వరుస అరెస్టులతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయ్. ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, టెక్కెలి తెదేపా ఎమ్మెల్యే శుక్రవారం అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు నకిలీ పత్రాల కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో వీరిని అదుపులోనికి తీసుకొని అనంతపురానికి తీసుకొచ్చారు.
తన సోదరుడి అరెస్టుపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. సోదరుడి అరెస్ట్ విషయాన్ని టీవీల ద్వారానే తెలిసిందన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఇటీవల బైపాస్ సర్జరీ చేశారని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. లారీల కొనుగోళ్లలో ఏం జరిగిందో తనకు తెలియదని.. కాకపోతే ఎన్‌వోసీ(నిరభ్యంతర పత్రం) ఇచ్చిన తర్వాత ఎవరైనా వాహనాలు నడుపుకొంటారని తెలిపారు.
ఇవాళ తన సోదరుడిని అరెస్టు చేశారని.. రేపు తనను అరెస్టు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. సీఎం జగన్ ఎవరికీ భయపడరని.. ఆయన్ను కంట్రోల్ చేయగలిగేది ఒక్క చంద్రబాబు మాత్రమేనన్నారు. జనాలు మాత్రం జేసీ చెబుతున్న ఒకే ఒక్కడిని కూడా సీఎం జగన్ అరెస్ట్ చేయించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరీ.. ఏపీలో అరెస్టుల పర్వం ఎక్కడివరకు కొనసాగుతుంది ? అన్నది చూడాలి.