తెలంగాణలో దుర్మార్గపు పాలన నడుస్తోంది

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందంటూ ఫైర్ అయ్యాడు టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్ది. గోదావరి ప్రాజెక్టుల సందర్శనకు యత్నించిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు.

”రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో సంతోషం, వెలుగు నింపాలని కోరుకున్నాం. సీఎంకు, మంత్రులకు, వారి కుటుంబాలకు కొవిడ్‌ ఆంక్షలు ఉండవా?కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభానికి వందలాది మంది మాస్కులు లేకుండా వచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీష్‌ రెడ్డి రోజూ వందల మందితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నా సొంత పార్లమెంట్‌ నియోజకవర్గంలో నేను ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లినా పోలీసులు అడ్డుకుంటున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పరు” అని ఉత్తమ్ అన్నారు