చంద్రబాబుకు నిరాశే !
ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, తెదేపా కీలక నేత అచ్చెన్నాయుడు అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన్నికలవడానికి తెదేపా నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. శుక్రవారం అచ్చెన్నాయుడిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సమయంలో ఆయన్ని కలవడానికి తెదేపా యువనేత నారాలోకేశ్ ప్రయత్నించారు. కానీ ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు.
ఇక ఈరోజు తెదేపా అధినేత చంద్రబాబు కూడా నిరాశే ఎదురైంది. అచ్చెన్నాయుడుని కలిసేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన చంద్రబాబుని పోలీసులు అడ్డుకున్నారు. అచ్చెన్నాయుడిని కలిసేందుకు మేజిస్ట్రేట్ అనుమతి కావాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ చెప్పడంతో చంద్రబాబు ఆస్పత్రి బయటే ఉండిపోయారు. అనుమతి రాకపోవడంతో బయటనుంచే ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి బయటే మీడియాతో మాట్లాడారు.
“అచ్చెన్నను ఉన్నపళంగా ఇంటినుంచి తీసుకొచ్చారు. ఆయనకు ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. నిన్న పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత దారుణం. తప్పుడు రికార్డులు సృష్టించి అరెస్టు చేశారు. 35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కుటుంబం ఆయనది. పేరున్న కుటుంబంపై బురద జల్లేందుకే ఇలాంటి అరెస్టులు చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గాలు సమాజానికి మంచివి కాదు. వైకాపా అవినీతిపై శాసనసభలో నిలదీస్తామనే ఇలాంటివి చేస్తున్నారు. ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ప్రలోభాలు పెట్టి మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లాక్కున్నారు. అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేయడం అధికార దుర్వినియోగమే అవుతుంది” అన్నారు చంద్రబాబు