పది పరీక్షల రద్దుకు పవన్ డిమాండ్

కరోనా ప్రభావంతో తమిళనాడు, తెలంగాణ, ఒడిషా, చత్తీస్ గడ్ రాష్ట్ర ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షలని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలోనూ పదో తరగతి పరీక్షలు రద్దవుతాయని అందరు భావించారు. కానీ, అలా జరగలేదు. పదో తరగతి పరీక్షలని నిర్వహించడానే ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. జులై 10 నుంచి పరీక్షల నిర్వహణకి ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నేపథ్యంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పదో తరగతి పరీక్షలని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చిన్నారుల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి వారి ప్రాణాలతో చెలగాటం ఆడడం ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవని అన్నారు. డిగ్రీ, పీజీతో పాటు వృత్తి, ప్రవేశ పరీక్షలు సైతం రద్దైపోయాయని గుర్తు చేశారు .రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఈ సమయంలో విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడం ప్రమాదకరమని పవన్‌ అన్నారు.