కరోనా చికిత్సని ఆరోగ్య శ్రీలోకి.. ఎందుకు తీసుకురాకూడదు ?

తెలంగాణలో మొదట్లో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్టు అనిపించింది. కానీ డిల్లీ మర్కజ్ ఘటన, కేంద్రం లాక్‌డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 200లకిపైగానే నమోదవుతున్నాయి. మరోవైపు ప్రయివేటు ఆసుపత్రులకి కరోనా చికిత్స చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనికి సంబంధించిన రేట్లని కూడా ఖరారు చేసింది.

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200గా నిర్ణయించారు. వెంటిలేటర్‌పై లేకుండా ఐసీయూలో ఉంచితే ప్రతిరోజూ రూ.7,500 చెల్లించాలి. వెంటిలేటర్‌పై ఉంటే రోజుకు రూ.9 వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులపైనా, గవర్నమెంట్ డాక్టర్లపైనా ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఇది బాగానే ఉంది. కానీ ఇంత మొత్తం చెల్లించి సామాన్యుడు ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగలడా ? అంటే.. కచ్చితంగా లేదని చెప్పవచ్చు.

అలాంటప్పుడు కరోనా చికిత్సని ఆరోగ్య శ్రీలో చేర్చవచ్చు కదా.. అని పలువురు అడుగుతున్నారు. కరోనా కట్టడి కోసం రూ. 100కోట్లు కాదు. రూ. 1000కోట్లు అయినా ఖర్చు చేస్తాం. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం. కడుపున పెట్టుకుంటం అన్నడు సీఎం కేసీఆర్. అలాంటప్పుడు కరోనా చికిత్సని ఆరోగ్య శ్రీలో చేర్చవచ్చు కదా. అప్పుడు పేదోడు హాయిగా కార్పోరేట్ ఆసుపత్రుల్లో కరోనాకి చికిత్స తీసుకుంటాడు. కానీ, కరోనా ని ఆరోగ్య శ్రీలో చేర్చడం కుదరదని మంత్రి ఈటెల ఇప్పటికే ప్రకటన చేశాడు.
 
మంత్రి ప్రకటనతో సీఎం కేసీఆర్ ప్రకటనలన్నీ ఉత్తివే. ఆయన కరోనా కట్టడి కోసం రూ. 1000కోట్లు ఖర్చు చేస్తా అంటాడు. కానీ కరోనా చికిత్సని ఆరోగ్య శ్రీలో చేర్చడనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వినబడుతున్నాయ్. ఈ అపవాదు పోవాలంటే.. పేదోడికి అంటే ఆరోగ్య శ్రీ కార్డ్ ఉన్న ప్రతోడి కార్పోరేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స చేయించుకొనే అవకాశం కల్పించాల్సిందే. కరోనా బారినపడిన తెరాస ఎమ్మెల్యేలు ప్రస్తుతం కార్పోరేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కదా. పేదలకి కూడా ఆ అవకాశం ఇవ్వండి సారూ.. !