కరోనా కట్టడికి ఏం చేద్దాం ?
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా.. తొలి రోజు దేశంలో కొవిడ్ ప్రభావం పెద్దగా లేని 21 చిన్న, ఈశాన్య, హిమాలయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలకులతో ప్రధాని మాట్లాడుతున్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఈ నెలాఖరుకు ముగియనున్న నేపథ్యంలో జూన్ 30 తర్వాత ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా ప్రధాని చర్చిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. “కొవిడ్ మరణాల సంఖ్య దేశంలో తక్కువగానే ఉంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి. మాస్కులు ధరించకుండా ప్రజలు బయటకు వెళ్లకూడదు. మాస్కు ధరించడం మీతోపాటు మీ పక్కవాళ్లకూ మంచిది. సబ్బు, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం మరవకూడదు. అందరూ ఇంటి పరిసరాలను గమనించి నడుచుకోవాలి. దేశంలో పారిశ్రామిక ఉత్పాదకత మెరుగుపడింది. ఎగుమతులు పూర్వస్థితికి వచ్చాయి. పరిశ్రమలకు తక్షణం రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లకు సూచించాం. సత్వర రుణాలిస్తే ఉత్పత్తి ప్రారంభమై ఉపాధి లభిస్తుంది. సంస్కరణలతో వ్యవసాయ రంగం వృద్ధి చెందింది’ అని అన్నారు.
ఇక దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 15 పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని బుధవారం సమీక్షించనున్నారు. దేశంలో కరోనా మొదలైన నాటి నుంచి ఇలా ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడటం ఇది ఆరోసారి.