70 దేశాలకి ఐఎంఎఫ్ నిధులు
కరోనా విజృంభిస్తున్న వేళ ప్రపంచ దేశాలకి అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ఊరటనిచ్చే వార్త చెప్పింది. తీవ్ర ఆర్థిక ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న దేశాలకు అండగా నిలిచేందుకు ఐఎంఎఫ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 70దేశాలకి ఆర్థిక సాయం చేయనుంది. అత్యవసర నిధుల కింద 25 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించినట్లు సంస్థ అధికార ప్రతినిధి గేరీ రైస్ వెల్లడించారు.
ఈ నిధులను కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఆయా దేశాలకు అందించినట్లు తెలిపారు. ఐఎంఎఫ్ సాధారణంగా అందించే రుణాలకు సంబంధించిన నియమ నిబంధనలు వీటికి వర్తించవని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది వేతనాలు, వైద్య పరికరాల కొనుగోలు సహా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలకు ఈ నిధుల్ని వినియోగించాలని తెలిపారు.