వర్మని ఏకిపారేసిన అమృత


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రణయ్‌ హత్య’ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ’ మర్డర్‌’ పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫాదర్స్‌ డే సందర్భంగా ఆదివారం దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రణయ్‌-అమృతల ప్రేమ వ్యవహారం, ఆపై మారుతీరావు చేయించిన పరువు హత్య నేపథ్యంగా సినిమా తీయనున్నట్టు పోస్టర్‌ చూస్తే అర్థమౌతోంది.

దీనిపై తాజాగా అమృత స్పందించారు. “నువ్‌ విడుదల చేసిన పోస్టర్‌ చూశాను. దీనికి, నా జీవితానికి ఎక్కడా పోలికలు లేవు. ఇదంతా మా పేర్లను ఉపయోగించి నువ్వు అమ్ముకోవాలని చూస్తున్న ఓ తప్పుడు కథ. రెండు నిమిషాల పేరు కోసం నీ లాంటి ఓ ప్రముఖ దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదు. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు నిన్ను చూస్తే జాలేస్తోంది. నీపై ఎలాంటి కేసులు వేయను.ఈ నీచ, నికృష్ట, స్వార్థపూరిత సమాజంలో నువ్వూ ఒకడివే. దీన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఏడుద్దామన్నా కన్నీళ్లు రావడం లేదు. హృదయం బండబారి పోయింది. దయచేసి నా జీవితాన్ని బజారులో పెట్టొద్దు. ఎన్నో బాధలను అనుభవించా. ఈ బాధ అంత పెద్దదేం కాదు. రెస్ట్‌ ఇన్‌ పీస్” అని అమృత ఓ ప్రకటనలో పేర్కొన్నారు.