ఇప్పుడు స్టార్ హీరోయిన్.. అప్పుడు మాత్రం బట్టలు కొనడానికి డబ్బుల్లేవ్ !
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. నటనపై ఆసక్తితో రూ.1500 చేత పట్టుకుని ఇంటి నుంచి ముంబయికి వచ్చింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని.. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. తనలాగే ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి అండగా నిలుస్తోంది. అయితే హీరోయిన్ గా నిలదొక్కుకొనే క్రమంలో ఆమె పడిన కష్టాలని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కంగనా.
‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ‘గ్యాంగ్‌స్టర్’ సినిమా తర్వాత నాకు అవార్డు ఇస్తారేమోనని భావించి తొలిసారి అవార్డుల ప్రదానోత్సవానికి వెళ్లాను. ఆ వేడుకలకు వెళ్లడానికి నా దగ్గర సరైన దుస్తుల్లేవు. డిజైనర్ గౌనులు కొనుగోలు చేయడానికి డబ్బుల్లేవు. అలాంటి సమయంలో రిక్కీ రాయ్ అనే స్నేహితుడు నాకు దుస్తుల విషయంలో సాయం చేసేవాడు. అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నాకు డిజైనర్ దుస్తులు ఇచ్చేవాడు. అలా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొని ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నాను’ అని చెప్పుకొచ్చింది.