ప్రైవేటు స్కూల్ ఫీజులపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.
గతకొంత కాలంగా ప్రైవేటు స్కూలు ఫీజులపై కొనసాగుతున్న సస్పెన్స్ పై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ప్రైవేటు స్కూళ్లు ఈ విద్యాసంవత్సరం ఫీజులు పెంచడాన్ని తల్లిదండ్రుల సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. స్కూలు ఫీజులను నియంత్రించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయి. ప్రైవేటు స్కూళ్లను కట్టడి చేయాల్సిన ప్రభుత్వమే మిన్నకుండటాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయం పై స్పందించింది.
ప్రైవేటు స్కూలు ఫీజులను పెంచాలా, తగ్గించాలా అనేదానిపై ప్రభుత్వం ఒక స్పష్టతకు రాకపోయినా తల్లిదండ్రులపై భారం తగ్గించేలా ఒక సర్క్యులర్ ను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం ఫీజు ల విషయం లో తుది నిర్ణయం తీసుకునే వరకు 2017- 18 విద్యా సంవత్సరం ఫీజు లనే 2018-19 విద్యా సంవత్సరం లోను కొనసాగించాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.