అచ్చెన్నాయుడు డిశ్చార్జ్’పై చంద్రబాబు ఆగ్రహం

మాజీ మంత్రి, టెక్కలి తెదేపా ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి.. జైలుకి తరలించారు. దీనిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడిని ఒక్కరోజైన జైలులో పెట్టాలే సైకో మెంటాలిటీతో ప్రభుత్వం ఉందని విమర్శించారు. వరుస ట్విట్స్ బాబు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.

‘ఇప్పటికే అచ్చెన్నాయుడు అరెస్ట్ లో ప్రభుత్వం అడుగడుగునా అమానవీయంగా వ్యవహరించి, ఆయనకు రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైంది. ఇంకా కక్షతీరలేదన్నట్టు, ఆయన్ను ఉన్నట్టుండి డిశ్చార్జ్ చేయించి డాక్టర్స్ డే రోజున మరో దుర్మార్గానికి పాల్పడింది ప్రభుత్వం’

‘డిశ్చార్జ్ చేయడంలో కూడా కనీస నిబంధనలు పాటించరా? సాయంత్రం 5 గంటల  తర్వాత డిశ్చార్జ్ చేస్తూ,  4.20 గం.ల సమయం వేయడం ఏంటి? కమిటీ ముసుగులో, తప్పుడు నివేదికలతో అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో చెలగాటం ఆడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’

‘చికిత్స పొందాల్సిన వ్యక్తిని వీల్ చైర్ లో కూర్చోబెట్టి, అంబులెన్సులో జైలుకు తీసుకువెళ్ళడం వెనుక… అచ్చెన్నాయుడును ఒక్కరోజైనా జైల్లో ఉంచాలనే మీ సైకో మనస్తత్వం కనపడుతోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని చంద్రబాబు వరుస ట్విట్స్ చేశారు.