ఫ్రొఫెసర్ రంగంలోకి దిగారు

తెలంగాణలో అసలు ప్రతిపక్షమే లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తెలంగాణ కాంగ్రెస్ పూర్తిగా విఫలైంది. గతంలో ప్రాజెక్టులు, ఇటీవల కరెంట్ బిల్లులపై ఆ పార్టీ బలంగా పోరాడలేకపోయింది. అసలు కాంగ్రెస్సోళ్లని ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. ఇటీవల తెలంగాణ బీజేపీ కేసీఆర్ సర్కార్ ని గట్టిగానే నిలదీసే ప్రయత్నం చేస్తోంది. కరోనా చికిత్సని ఆరోగ్య శ్రీని కిందికి తీసుకురావాలని తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా తెజస అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కోదండరామ్ రంగంలోకి దిగారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కోదండరామ్‌ ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరామ్.. ప్రతి పేద కుటుంబానికి రూ.7,500 ఆర్థిక సాయం చేయాలని కోరారు. సీఎం సహాయనిధికి ఎన్ని నిధులు వచ్చాయో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

కేంద్రం నుంచి వచ్చిన నిధులపైనా స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని తప్పిదాలకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌దేనని, మొత్త వనరులను కొవిడ్‌ నిర్మూలనకు ఖర్చు చేయాలన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు భరోసా కల్పించాలని కోరారు.