లద్దాఖ్‌లో ప్రధాని ఆకస్మిక పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో పర్యటిస్తున్నారు. లద్దాఖ్‌లోని నిము ప్రాంతంలో సీనియర్ ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న నిము కఠినమైన భూభాగాలలో ఒకటి. ఇక్కడ ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో ప్రధాని మాట్లాడారు. సరిహద్దులో తాజా పరిస్థితులను ఉన్నతాధికారులు ప్రధానికి వివరించారు.
గల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అనంతరం ఇక్కడ పరిస్థితిని ప్రధాని సమీక్షిస్తున్నారు. చైనా బలగాలతో ఘర్షణలో గాయపడ్డ జవాన్లను మిలటరీ ఆస్పత్రిలో ప్రధాని పరామర్శించనున్నారు. మోదీతోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే ఉన్నారు. సరిహద్దుల్లో భారత్, చైనా రెండు ఇప్పటికే సైన్యాన్ని మోహరించాయి. మరోవైపు చర్చలు జరుపుతున్నాయి. పలు దఫాలుగా జరుగుతున్న చర్చలు విఫలమైతే.. ఫైనల్ గా యుద్ధం రావొచ్చు. మరోవైపు, చైనాని అష్టదిగ్భంధనం చేసే పనిలో భారత్ ఉంది.