బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్య


పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్రనాథ్ రాయ్ అనుమాస్పదంగా మృతి చెందారు. తన సొంతూరుకు కిలోమీటర్ దూరంలో ఉన్న బిందాల్ వద్ద మూసేసి ఉన్న దుకాణం వరండాలో ఎమ్మెల్యే ఉరివేసుకొన్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదు. హత్యేనని ఎమ్మెల్యే దేబేంద్రనాథ్ రాయ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆదివారం రాత్రి కొందరు వచ్చి ఎమ్మెల్యేను బైక్ పై ఎక్కించుకు పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. తెల్లారేసరికి బిందాల్ ఏరియాలో మూసివేసిన దుకాణం వరండాలో ఎమ్మెల్యే వేలాడుతుండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ హెమ్తాబాద్ నియోజకవర్గం నుంచి బెంగాల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

దేబేంద్ర నాథ్ సీపీఐ-ఎం పార్టీని వీడి 2019, మే నెలలో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు 50 మంది కౌన్సిలర్లు.. బీజేపీ సీనియర్లు ముకుల్ రాయ్, కైలాష్ విజయవర్గీయ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనపై కక్ష్య కట్టారు. అందుకే హత్య చేశారు. కచ్చితంగా ఇది రాజకీయ హత్యేనని  ఎమ్మెల్యే దేబేంద్రనాథ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.