మ‌హిళా క‌మెడియ‌న్‌కు లైంగిక వేధింపులు

యేడాది క్రితం చేసిన పనికి ఆ మహిళా కమెడియన్ ని ఇంకా వేధిస్తున్నారు. ముంబ‌య్‌కి చెందిన స్టాండ‌ప్ క‌మెడియ‌న్ అగ్రిమా జాషువా హిందీ ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచితురాలు. ఆమె 2019లో మ‌హారాష్ట్ర‌లో ఏర్పాటు చేయాల‌నుకున్న చ‌త్ర‌ప‌తి శివాజీ విగ్ర‌హం గురించి సోష‌ల్ ఓ మీడియాలో వీడియో పెట్టారు. ఈ వీడియోలో ఆమె వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అప్పట్లో ఆమెని టార్గెట్ చేస్తూ చాలామంది విమర్శలు చేశారు. అయితే  అక‌స్మాత్తుగా ఇప్పుడు ఆ వీడియో మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది.

ఆమెపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌ల దాడికి దిగారు.వ‌డోద‌ర‌కు చెందిన శుభం మిశ్రా అనే వ్య‌క్తి అగ్రిమాపై అస‌భ్య ప‌ద‌జాలంతో దూష‌ణ‌కు దిగాడు. లైంగిక వేధింపుల‌తో బెదిరింపుల‌కు దిగుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో అత‌ను ఓ వీడియో షేర్ చేశాడు. దీనిపై అగ్రిమా జాషువా జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జాతీయ మ‌హిళా క‌మిష‌న్ వెంట‌నే స్పందించి నిందితుడిపై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది. వడోదర పోలీసులు కేసు నమోదు చేసి  నిందితుడు మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు.