కరోనాతో డిప్యూటీ కలెక్టర్ మృతి
ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారినపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో కరోనాతో డిప్యూటీ కలెక్టర్ మృతి చెందారు. హుగ్లీ జిల్లాలోని చందన్ నగర్ సబ్ డివిజన్ కు చెందిన డిప్యూటీ కలెక్టర్ దేబ్ దత్తా రాయ్(38) కరోనాతో కన్నుమూశారు.
గతవారం దేబ్ దత్తా రాయ్ లో కరోనా లక్షణాలు కనిపించాయి. కరోనా టెస్టులో పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో ఆమెని హోం క్వారంటైన్ చేశారు. అయితే ఆదివారం ఉదయం డిప్యూటీ కలెక్టర్ కు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమెని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే సోమవారం చికిత్స పొందుతూనే దేబ్ దత్తా రాయ్ తుదిశ్వాస విడిచారు. డిప్యూటీ కలెక్టర్ మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.
వలస కూలీలని సొంత ప్రాంతాలకి తరలించే సమయంలో డిప్యూటీ కలెక్టర్ దేబ్ దత్తా రాయ్ కీలకంగా వ్యవహరించారు. హుగ్లీ జిల్లాకు రైళ్లల్లో వచ్చిన కార్మికులను క్వారంటైన్ కు తరలించే బాధ్యతను దేబ్ దత్తా రాయ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆమెకు కరోనా సోకి ఉండొచ్చని వైద్యులు పేర్కొన్నారు. దేబ్ దత్తా రాయ్ కి నాలుగేళ్ల కొడుకు ఉన్నారు.