గవర్నర్ vs కాంగ్రెస్..! రాజ్ భవన్ లో అసలేం జరిగింది..?
గవర్నర్ నరసింహన్ కు కాంగ్రెస్ నేతలకు మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఇసుక మాఫియా, మందకృష్ణ మాదిగ అరెస్ట్ తో పాటు ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ నరసింహన్ ను కలిసి వివరించడానికి శుక్రవారం రాజ్ భవన్ కు వెళ్లారు కాంగ్రెస్ నేతలు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి , మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కొత్త సంవత్సరంలో అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలంటూ గవర్నర్ మాట్లాడటంపై సర్వే సత్య నారాయణ సీరియస్ గా రియాక్ట అయినట్టు తెలుస్తోంది. గవర్నర్ హోదాలో ఉండి ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడమేంటని సర్వే సీరియస్ అయ్యారు. సమస్యలను వినకుండానే మంత్రి కేటీఆర్ ను , ప్రభుత్వాన్ని వెనకేసుకురావడమేంటని వారు ప్రశ్నించారు.దీంతో గవర్నర్ కూడా కాంగ్రెస్ నేతలపై సీరియస్ గా స్పందించినట్లు సమాచారం. ఇద్దరి మధ్యా కాసేపు వాడి, వేడి చర్చ జరగినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్,జానారెడ్డి సర్వే కు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారట. వినతి పత్రం సమర్పించిన తరువాత మిమ్మల్ని మళ్లీ కలవబోమంటూ కాంగ్రెస్ నేతలు గవర్నర్ తో చెప్పి వచ్చినట్లు సమాచారం.
అయితే రాజ్ భవన్ వర్గాలు మాత్రం కాంగ్రెస్ నేతలు, గవర్నర్ మధ్య సహృద్భావ వాతావరణంలోనే చర్చలు జరిగాయని చెబుతున్నాయి. వారు వినతి పత్రం ఇవ్వడంతో సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని గవర్నర్ చెప్పినట్లు రాజ్ భవన్ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. మొత్తం మీద రాజ్ భవన్ లో కాంగ్రెస్ భేటీ పెద్ద దుమారం రేపింది. రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చింది..