ట్రంప్ వెనక్కి తగ్గారు
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులు అమెరికా విడిచి వెళ్లాలని ట్రంప్ జులై 6న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. లేదా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే విద్యాబోధన అందించే వర్సిటీలకు మారాలని సూచించారు. తాజాగా దీనిపై ట్రంప్ వెనక్కి తగ్గారు. ఈ విషయాన్ని మంగళవారం ఆయన పాలకవర్గం మసాచుసెట్స్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అలిసన్ డి బరోకు తెలిపింది.
ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మొత్తం ఎనిమిది వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దాదాపు 200 పైగా విద్యా సంస్థలు వీటిపై సంతకాలు చేశాయి. వీరికి సాంకేతిక దిగ్గజ సంస్థలైన గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలూ మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వెనక్కి తగ్గారు. దీంతో అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట లభించినట్టయింది.