కేసీఆర్ వ్యవ’సాయం’పై పడ్డారు

ముఖ్యమంత్రి కేసీఆర్’కు వ్యవసాయం అంటే మక్కువ. ఆయన ప్రతియేడు వ్యవసాయం చేస్తుండు. ఆధునిక పద్ధతులని అవలంభించి పంట తీస్తుండు. ఆయనకు రైతుల బాధలు ఎట్లుంటయ్ అన్నది బాగా తెలుసు. అందుకే యావత్ తెలంగాణ రాష్ట్ర రైతుల కష్టాలని తీర్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిండు. ఈ యేడాది నుంచి రైతులకి నాణ్యమైన 24గంటల ఉచిత కరెంటుని అందజేస్తుండు. ఇప్పుడు వ్యవసాయ సంబంధిత అంశాలపై దృష్టి సారించిండు. ఐతే, వ్యవసాయపై సీఎం ఫోకస్ చేయడం కాస్త ఆలస్యమైందన్న విమర్శలు ఉన్నాయి. బాహుశా.. ప్రాధాన్యతా క్రమంలో జరిగిన జాప్యం అయి ఉంటుంది.

ప్రగతి భవన్‌లో శుక్రవారం సీఎం కేసీఆర్ వ్యవసాయ సంబంధిత అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పంటలకు మార్కెట్‌లో మద్దతు ధర రాకపోతే ప్రభుత్వమే నేరుగా కొనే విధానంపై అధికారులతో చర్చించారు. ఈ ఏడాది నుంచే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెడతామని తెలిపారు. ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించేలా కేంద్ర విధానం ఉండాలని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న “పెట్టుబడి మద్దతు పథకం”పై అధ్యయనానికి మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. నిజంగానే.. సీఎం సాయం రైతులకు అందితే.. రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మన తెలంగాణని చూడొచ్చు. అప్పుడు బంగారు తెలంగాణ పయనం మరింత సులభం అవుతుందని చెప్పవచ్చు.