రాజస్థాన్ రాజకీయాలపై తెలంగాణ ప్రజల పోరాటం !
తెలంగాణలోని సమస్యలపై పోరాడే సత్తువే లేదు కాంగ్రెస్ పార్టీకి. అలాంటిది రాజస్థాన్ రాజకీయాలపై తెలంగాణలో పోరాటానికి పిలుపునివ్వడం నిజంగా హాస్యాస్పదం. రాజస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం సామాజిక మాధ్యమాల్లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్పీకప్ ఫర్ డెమోక్రసీ’ పేరుతో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
అంతేకాదు రాజస్థాన్ రాజకీయాలపై సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టనుంది. దీనికి మద్దతుగా తెలంగాణ ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు ఉత్తమ్. ఉత్తమ్ పిలుపుని విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ? పోరాటం జేయాలంటే తెలంగాణలోనే బోలేడు సమస్యలున్నాయి.
కరోనా లాక్డౌన్ వచ్చిన కరెంట్ బిల్లులు చూసి పేదలకి నిజంగా షాక్ తగిలింది. వందల్లో వచ్చేటోడి కరెంటు బిల్లు వేలల్లో, వేలల్లో వచ్చే కరెంట్ బిల్లు లక్షల్లో వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వంపై పోరాడలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక కరోనా విజృంభిస్తున్న వేళ ప్రయివేటు ఆసుపత్రులు దోచుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా చికిత్సని ఆరోగ్యశ్రీలోకి తేవాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. దీనికి కాంగ్రెస్ పోరాటం సున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అవన్నీ గాలికొదిలేసి.. ఇప్పుడు రాజస్థాన్ రాజకీయాలపై తెలంగాణలో పోరాటం చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఏమైనా సిగ్గు, శరం ఉండాలి.. ముందు స్థానిక సమస్యలపై పోరాడండి. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల రాజకీయాల గురించి ఆలోచించండని ప్రజలు తిట్టిపోస్తున్నారు.