ఒకేరోజు 34వేల మంది డిశ్చార్జ్
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 50వేలకి చేరువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 13లక్షల 85వేలకు చేరింది. అయితే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకునే వారిసంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 34,145 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకేరోజు రికార్డుస్థాయిలో ఇంతమంది కోలుకొని డిశ్చార్జి కావడం ఇదే తొలిసారి.
ఇప్పటివరకు దేశంలో కరోనా బాధితుల్లో 8,85,577 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 4,67,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో కరోనా రికవరీ రేటు 63.92శాతానికి పెరిగింది. మరణాల రేటు 2.31శాతానికి తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో 50వేలకు పైగా కేసులు నమోదైన రాష్ట్రాలు తొమ్మిది ఉన్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో మరిన్ని ఎక్కువ కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.