అన్‌లాక్‌ 3.0 : థియేటర్స్ తెరచుకోబోతున్నాయ్

ఈనెల 31తో అన్‌లాక్‌ 2.0 ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా ? లేక అన్‌లాక్‌ 3.0 ప్రకటిస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది.

కేంద్ర మూడ్ ని చూస్తుంటే మాత్రం మరోసారి లాక్‌డౌన్  విధించేలా లేదు. అన్‌లాక్‌ 3.0పైనే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అన్‌లాక్‌ 3.0లో మరిన్ని రంగాలకి వెసులుబాటు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అన్‌లాక్‌ 3.0లో భాగంగా జిమ్‌లు, సినిమాహాళ్లకు అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. భౌతికదూరం నిబంధనల మేరకు వీటిని గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వొచ్చు.

మరోవైపు థియేటర్‌ యజమానులు వాటిని ఓపెన్‌ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో అనుమతించాలని కోరుతుండగా, కేంద్రం 25శాతం సీటింగ్‌ సామర్థ్యంతో అనుమతిస్తామని చెబుతోంది.  అయితే, పాఠశాలలు, మెట్రో రైళ్లు, సేవలపై లాక్‌డౌన్‌ నిబంధనలు వర్తిస్తాయి.