ఆ రెండు రాష్ట్రాల్లో లక్ష దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 50వేలకి చేరువగా నమోదవుతున్నాయి. ఇక లక్ష కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితా పెరుగుతోంది. లక్షకు పైగా కేసులు నమోదైన రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య ఐదుకు చేరింది. నిన్నటి వరకు మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ మాత్రమే ఈ జాబితాలో ఉండగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వచ్చి చేరాయి. ఒకే రోజు ఈ రెండు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది.
ఈ రెండు రాష్ట్రాల్లోనూ భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. మరణాలు కూడా అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దీంతో ఈ ఏపీలో ఇవాళ కొత్తగా 6051 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 49 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,349కి చేరింది. 51,701 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. మరోవైపు కర్ణాటకలో ఇవాళ 5,324 కేసులు, 75 మరణాలు సంభవించాయి. దీంతో ఈ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,01,465కి పెరిగింది. మరణాల సంఖ్య 1953కి చేరింది.