సీనియర్ నటుడు రావి కొండలరావు కన్నుమూత
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాత రావి కొండలరావు కన్నుమూశారు. గత కొంత కాలంగా హుద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
1958లో ‘శోభ’ చిత్రంతో ఆయన సినీ నటన మొదలైంది. పాఠశాల చదువు కాకినాడలో. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ గా చేశారు. కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. నరసరాజుగారి సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్‌వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు.
ఆయనకు రాధాకుమారితో వివాహం అయింది. ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట. ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో డాక్టరు వేషం లభించింది. విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా చేశారు. కొండలరావు దాదాపు 150 సినిమాల్లో నటించారు.