రఫేల్ వస్తోంది.. దీపాలు వెలిగించండి !
ఫ్రాన్స్‌లోని బోర్డోలో నగరం నుంచి బయల్దేరిన ఐదు రఫేల్ విమానాలు 7000 కిలోమీటర్లు ప్రయాణించి నేడు అంబాలాకు చేరుకోనున్నాయి. దాదాపు ఏడు గంటలకుపైగా ప్రయాణించి సోమవారం యూఏఈలోని అల్ దాఫ్రా వైమానిక స్థావరానికి చేరుకున్న ఈ విమానాలు మంగళవారం గాల్లోనే ఇంధనం నింపుకున్నాయి. 30 వేల అడుగులు ఎత్తులో వాటికి.. ఫ్రెంచ్ ట్యాంకర్ విమానం ఇంధనాన్ని నింపింది. అంబాలా చేరుకున్న తర్వాత తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న లద్దాఖ్‌కు తరలించే అవకాశం ఉంది.
రఫేల్ యుద్ధ విమానాలకు ఘన స్వాగతం పలికేందుకు అంబాలా వైమానిక స్థావరం సిద్ధమైంది. వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా విమానాలను స్వీకరించనున్నారు. కొవిడ్ మహమ్మారి ముప్పు లేకుంటే చుట్టుపక్కల ప్రజలు వేలాదిగా వీధుల్లోకి తరలివచ్చి యుద్ధ విమానాలను స్వాగతం పలికేవారు. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎవరూ రాకుండా.. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. అంతేకాదు.. ఫోటోలు, వీడియోలకి అనుమతులు ఇవ్వలేదు. అయితే, రఫేల్ రాకను స్వాగతిస్తూ సాయంత్రం 7-7:30 మధ్య ఇళ్లలోనే దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు స్థానిక ఎమ్మెల్యే అసీం గోయల్.