అల్లు అర్జున్-కొరటాల అధికారిక ప్రకటన వచ్చేసింది

ఇటీవల టాలీవుడ్ చక్కర్లు కొడుతున్న ఓ గాసిప్ నిజమైంది. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తో దర్శకుడు కొరటాల శివ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. కరోనా టైమ్ లో కొరటాల బన్నీ కోసం ఓ అద్భుతమైన కథని రెడీ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది అనే కథనాలు వచ్చాయి. ఇప్పుడీ.. ఈ ప్రచారం నిజమైంది.

బన్నీ-కొరటాల సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నది ఒడ్డున దూరంగా ఓ ఊరును చూస్తున్న ఇద్దరు వ్యక్తులతో ఈ పోస్టర్‌ రూపొందించారు. అదే ఫ్రేమ్‌లో గద్దలు తిరుగుతున్న ఆకాశం, ఓ పక్క తెప్ప, కింద పడిపోయిన లాంతరు ఉన్నాయి. పోస్టర్‌ను గ్రే, రెడ్‌ కలర్‌ కాంబినేషన్‌లో రూపొందించారు. చిత్రబృందం ఇందులో కథ, ఆలోచనను చెప్పే ప్రయత్నం చేసింది. 

ఇక ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్‌, యువసుధ ఆర్ట్స్‌ కలసి నిర్మిస్తున్నాయి. కొరటాల శివ స్నేహితుడు సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాత కాగా, అల్లు అర్జున్‌ స్నేహితులు శాండీ, స్వాతి, నట్టి సహ నిర్మాతలు. 2022 ప్రథమార్ధంలో సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం పోస్టర్‌లో తెలిపింది. ఇందులో అల్లు అర్జున్‌ విద్యార్థి నాయకుడిగా కనిపిస్తారట. యువతను రాజకీయాల్లోకి రమ్మని చెప్పే యువకుడిగా బన్ని కనిపిస్తాడట. మెరుగైన సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని తెలియజేసేలా కథ ఉండబోతోందని తెలుస్తోంది.