కరోనా చికిత్స ఖరీదైనది కాదు : ఈటెల

కరోనా చికిత్స ఖరీదైనది కాదు. ఆక్సిజన్‌, మందులన్నీ కలిపితే కూడా రూ.పదివేలకు మించి కాదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన టిమ్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడారు. టిమ్స్‌లో 1,350 బెడ్ల సౌకర్యం ఉందని, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు, వెంటిలేటర్లతో కూడిన సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. టిమ్స్‌ ఆసుపత్రిలో అన్ని గదులను కలియతిరిగి పరిశీలించినట్లు చెప్పారు.

లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో చేరాలి. కొందరు నాలుగైదు రోజుల ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. అందుకే వైరస్‌ తీవ్రత అధికమవుతోందని, వారిని రక్షించడం కష్టమవుతుందని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చి శ్వాస ఇబ్బంది కలిగితే తక్షణమే ఆసుపత్రిలో చేరాలని సూచించారు. కరోనా చికిత్స ఖరీదైనది కాదని, ఆక్సిజన్‌, మందులన్నీ కలిపితే కూడా రూ.పదివేలకు మించి కాదని మంత్రి ఈటల స్పష్టం చేశారు. రోజుకు లక్ష, రెండు లక్షలు ఖర్చు అయ్యే చికిత్స అసలు లేదని చెప్పారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి.. అడ్డగోలుగా వసూళ్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.