కోవిడ్ కేర్ అగ్నిప్రమాదం : మృతుల కుటుంబాలకి 50లక్షల పరిహారం

విజయవాడలో రమేశ్‌ ఆస్పత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ అగ్నిప్రమాదంపై సీఎం జగన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని  అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు.

ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రమాదం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు చేపట్టాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ సీఎం జగన్ కి ఫోన్ చేశారు. విజయవాడ అగ్నిప్రమాద ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ట్విట్టర్ వేదికగా కూడా ప్రధాని మృతుల కుటుంబాలకి సంతాపం తెలిపారు.