వచ్చే నెల 21 నుంచి రాజధాని అంశాల విచారణ


ఏపీ హైకోర్టులో సీఆర్డీఏ, రాజధాని వికేంద్రీకరణ పిటిషన్లపై ఈరోజు విచారణ జరిగింది. రైతులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు మొత్తం 70 పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

మరోవైపు, విశాఖలోని కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అతిథిగృహాన్ని నిర్మించ తలపెట్టిందని, స్టేటస్‌ కో ఉన్నప్పుడు అతిథిగృహ నిర్మాణానికి శంకుస్థాపన ఏంటని పిటిషనర్ సుప్రీంకోర్టు న్యాయవాది నితీశ్‌ గుప్తా ‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్యనిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా భాగమేనని వాదనలు వినిపించారు. దీనిపై సెప్టెంబరు 10వ తేదీ లోపు కౌంటరు దాఖలు చేయాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది.