ఇక లాక్‌డౌన్లు లేనట్టే !

కరోనా లాక్‌డౌన్లకు కాలం చెల్లిపోయింది. ఈ మేరకు కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చింది. శనివారం కేంద్రం అన్ లాక్ 4 గైడ్ లైన్స్ విడుదల చేసింది. మరిన్ని సడలింపులు ఇచ్చింది. కంటైన్‌మెంట్‌ జోన్లు మినహాయిస్తే స్థానికంగా ఎలాంటి లాక్‌డౌన్లు విధించకూడదని రాష్ట్రాలకు/ కేంద్ర ప్రాంతాలకు కేంద్రం స్పష్టంచేసింది.

కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా లాక్‌డౌన్లు విధించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే, రాష్ట్రం పరిధిలోగానీ, అంతర్రాష్ట్ర ప్రయాణాలకు గానీ ఎలాంటి ఆంక్షలూ ఉండకూడదని రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇకపై దేశంలో కరోనా లాక్‌డౌన్లు ఉండవు. కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిందేనని కేంద్రం స్పష్టత ఇచ్చినట్టయింది.

ఇక అన్ లాక్ 4 లో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులకి కేంద్రం అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్‌ 21 నుంచి విద్యా, క్రీడా, వినోద, మత, రాజకీయ కార్యకలాపాలను ఇండోర్‌లో జరుపుకొనేందుకు అవకాశం ఇచ్చింది. అదీ కూడా 100 మంది వరకు మాత్రమే అనుమతి.  సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు, పరిమిత ఆంక్షలతో సామాజిక కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చింది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, థియేటర్లు సెప్టెంబర్ 30 వరకు మూసే ఉంటాయని కేంద్రం పేర్కొంది.