కరోనా మరణాలు : మూడో స్థానంలోకి భారత్

భారత్ లాంటి దేశంలో కరోనాని కట్టడి చేయడం కష్ట సాధ్యమైన పని అని నిపుణులు చెబుతున్న మాట. అది నిజమే. కరోనా లాక్‌డౌన్లు లేకుంటే.. భారత్ పరిస్థితి దారుణంగా ఉండేది. అయితే లాక్‌డౌన్ సడలింపుల తర్వాత దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ 70వేలకి చేరువగా కొత్త కేసులు, వెయ్యి మరణాలు సంభవిస్తున్నాయ్. అయితే ఇప్పటికే కరోనా పట్ల ప్రజల్లో స్పష్టమైన అవగాహన రావడం, కేసులు పెరుగుతున్న రికవరీ రేటు పెరుగుతుండటం ఊరటనిచ్చే విషయం.

ఇక తాజాగా ప్రపంచంలోనే కరోనా మరణాల్లో భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. గడిచిన 24గంటల్లో భారత్ లో మరో 948 కరోనా రోగులు మృతిచెందారు. కరోనా మరణాల సంఖ్య 63,498కు చేరింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్ మూడోస్థానానికి చేరింది. 63వేల కరోనా మరణాలతో ప్రపంచంలో మూడోస్థానంలో కొనసాగుతున్న మెక్సికోకు భారత్‌ చేరువయ్యింది. ఇక నిన్న ఒక్కరోజే అత్యధికంగా మరో 78,761పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 35లక్షల 42వేలకు చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76శాతం దాటింది. మరణాల రేటు 1.8శాతంగా కొనసాగుతోంది.