నూతన్ నాయుడుని బహిష్కరించిన అన్నీ రాజకీయ పార్టీలు.. !
మంచి చేస్తే ఆడు మనోడే. మావోడే.. అంటూ క్రెడిట్ ని ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉంటాయ్ పొలిటికల్ పార్టీలు. సదరు వ్యక్తితో ఏదో విధంగా లింకు కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తాయి. అదే వ్యక్తి చెడు చేస్తే.. సీన్ రివర్స్ గా ఉంటుంది. ఇప్పుడు నూతన్ నాయుడు విషయంలో అదే జరుగుతోంది.
నూతన్ నాయుడు జనసేన మద్దతుదారుడు, పవన్ కల్యాణ్ అభిమాని అనే ముద్ర ఉండేది. ఇటీవల పవన్ కల్యాణ్ అభిమానుల కళ్లలో ఆనందం చూడ్డానికి ఆయన ‘పరాన్నజీవి’ అనే సినిమా కూడా తీశారు. అయితే ఇప్పుడు నూతన్ నాయుడు ఇంట్లో ఓ దళీత యువకుడికి శిరోముండనం జరగడంతో అంతా.. జనసేన వైపు చూస్తున్నారు. అయితే ఆ పార్టీ క్లియర్ కట్ ప్రకటన చేసింది. నూతన్ నాయుడు పేరుని ప్రస్తావించకుండా కనీసం పార్టీలో సభ్యత్వం లేనివారు చేసిన పనికి.. పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదని స్టేట్ మెంట్ ఇచ్చేసింది.
ఇక నూతన్ నాయుడులో నాయుడు ఉన్నాడు కాబట్టి. ఆయన తెదేపా, చంద్రబాబు మనిషి అని భావించే ఛాన్స్ ఉంది. ఈ విషయంలో తెదేపా జాగ్రత్తపడింది. నూతన్ నాయుడు వైకాపా సిద్ధాంతకర్త అంటూ ఆయన్ని బహిష్కరించినంత పని చేసింది. ఇక మిగిలింది అధికార పార్టీ వైసీపీ. నూతన్ నాయుడు వైసీపీకి చెందినవాడని ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవంలేదని స్పష్టం చేసింది.
నూతన్ నాయుడికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని వైకాపా చెప్పేసింది. దీంతో.. అన్నీ పార్టీలు కలిసి నూతన్ నాయుడుని బహిష్కరించినట్టయింది. ఇప్పుడు నూతన్ నాయుడు సామాన్యుడు మాత్రమే. ఆయన ఇంట్లో తప్పు జరిగింది. దాన్ని సామాన్యుడుగానే ఎదొర్కోవాలి. శిక్ష అనుభవించాలి. ఆయన్ని ఏ పార్టీ కూడా కాపాడలేదని అర్థమవుతోంది.