అలర్ట్ : విజయ్ దేవరకొండ పేరిట భారీ మోసాలు

సెలబ్రిటీల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇప్పటికే చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఇంకా ఎక్కువయ్యాయ్. తాజాగా టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ పేరిట జరుగుతున్న మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై విజయ్ టీమ్ జనాలని అలర్ట్ చేసింది.

“విజయ్‌ దేవరకొండతో సినిమా తీయబోతున్నామంటూ కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆయన సినిమాకు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నామంటూ.. నటీనటులను సంప్రదిస్తున్నాయి. విజయ్‌ నటించబోతున్న ఏ ప్రాజెక్టైనా సరే నిర్మాతలు అధికారికంగా నేరుగా ప్రకటిస్తారు.

అలాంటి సమాచారం ఉంటే.. విజయ్‌ దేవరకొండ తన అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా నిర్ధారిస్తారు. మేం సదరు నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోబోతున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు” అంటూ విజయ్‌ దేవరకొండ బృందం తెలిపింది.

ప్రస్తుతం విజయ్ ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఫైటర్ తెరకెక్కుతోంది. అనన్య పాండే హీరోయిన్. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా లాక్‌డౌన్ తో వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలుకానుంది.