కరోనాతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కన్నుమూత
కరోనా బారినపడిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కన్నుమూశారు. ఇటీవల దుర్గా ప్రసాద్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. అయితే ఈ సాయంత్రం ఆయనకి గుండెపోటు రావడంతో కన్నుమూశారని తెలుస్తోంది.
లాయర్ గా పని చేసిన దుర్గాప్రసాద్ 1985లో తెదేపాలో చేరారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం నుంచి సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1994, 1999, 2009లో తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెదేపా హయాంలో మంత్రిగా పని చేశారు. అయితే 2019 ఎన్నికలకి ముందు ఆయన వైసీపీలో చేరారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
బల్లి దుర్గా ప్రసాద్ మృతిపట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ఫోన్ చేసి మాట్లాడారు. నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజాసేవలో అవిరళ కృషి చేశారని కొనియాడారు. బల్లి దుర్గాప్రసాద్ మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్విట్ చేశారు.