అల.. అమలాపురంలో అరెస్టులు !


ఏపీలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడులని ఏపీ భాజాపా సీరియస్ గా తీసుకుంది. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తామని ఏపీ భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఇందులో భాగంగా ‘ఛలో అమలాపురం’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే అలర్టైన ఏపీ ప్రభుత్వం భాజాపా నేతలని ముందస్తు అరెస్టులు చేస్తోంది. గురువారం సాయంత్రంలో సోము వీర్రాజు, విష్ణు వర్థన్ రెడ్డిలని అరెస్ట్ చేశారు.

ఈ ఉదయం నుంచి కూడా అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రకాశం జిల్లా కారంచేడులో బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భీమవరంలో పార్టీ ఉపాధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉంగుటూరులో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, తాడేపల్లిగూడెంలో నరిసే సోమేశ్వరరావు, పోలవరంలో నియోజకవర్గ కన్వీనర్ కరిబండి నాగరాజులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. విశాఖ నగర బీజేపీ అధక్షుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ‘ఛలో అమలాపురం’ జరిపి తీరుతామని సోము వీర్రాజు ప్రకటించారు. అయితే ఏపీలో హిందూ దేవాలయాల వెనక రాజకీయ కుట్ర ఉంది. అవన్నీ దర్యాప్తులో బయటపడతాయని వైకాపా నేతలు అంటున్నారు.