రాములమ్మ స్థానం ఏంటీ ?

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నేటితో సరిగ్గా 20 యేళ్లు నిండాయి. ఆమె జీవితం ఎప్పుడూ ఒంటరే అని చెబుతుంటారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు టీఆర్ఎస్ కీలక నేతగా వ్యవహరించారు. తీరా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్’లోకి వెళ్లి మళ్లీ ఒంటరి అయిపోయారు. ఐతే, త్వరలోనే మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తానని చెబుతున్నారు రాములమ్మ.

గురువారం మీడియాతో మాట్లాడిన రాములమ్మ తన పొలిటికల్ ఎంట్రీ 20యేళ్లు పూర్తి చేసుకోవడాన్ని గుర్తు చేశారు. ఇక, తెలంగాణలో రాజకీయ యాత్ర చేస్తున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’కు తనదైన శైలిలో సలహా కూడా ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తెలంగాణలో చిరంజీవికే దిక్కులేదు. ఇక పవన్‌కు రాష్ట్రంలో ఏముంటుంది ? ఆయన తెలంగాణను వదిలేసి ఏపీపై దృష్టిపెడితే బాగుంటుందన్న సూచన చేశారామె.

త్వరలోనే రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రకటించిన విజ‌య‌శాంతి తనకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందని కటింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనని రాహుల్ ఏదో ఒక స్థానం నుంచి బరిలో నిలబడని కోరారని చెప్పుకొచ్చింది. గతంలో టీఆర్ ఎస్ లో ఉండగా రాములమ్మ మెదక్ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసేది. మరీ.. ఇప్పుడు ఆమె ఏ స్థానాన్ని ఎంచుకొంటుంది ? ఇంతకీ కాంగ్రెస్ లో ఆమె స్థానమెంటో ? ఆమె అభిమానులకే అంతుపట్టడం లేదు.