సుమేధ మృతిపై జీహెచ్ఎంసీ అనుమానాలు
హైదరాబాద్ నేరెడ్ మెట్ లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 12యేళ్ల సుమేధ సైకిల్ తొక్కుతూ ఓపెన్ నాలలో పడి కొట్టుకొని పోయి బండ చెరువులో విగతజీవిగా తేలింది. కూతురి మృతిపై సుమేధ తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మానవహక్కుల సంఘం కూడా ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని జీహెచ్ ఎంసీని కోరింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. సుమేధ మృతిపై అనుమానాలున్నాయన్నారు.
సుమేధ కొట్టుకుపోయిన రోజు ఆ ప్రాంతంలో అసలు వర్షమే పడలేదని గుర్తించామని మేయర్ బొంతు అన్నారు. అంతేకాదు.. ఓపెన్ నాలలో పడి దాదాపు 2కి. మీ కొట్టుకుపోయే ఛాన్స్ లేదు. పైగా చిన్నారికి చిన్ని గాయం కూడా తగలేదని గుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే చిన్నారి మృతిపై అనుమానాలున్నాయి. నిజంగానే నాలలో పడి కొట్టుకుపోయినట్లయితే జీహెచ్ ఎంసీ నుంచి నష్టపరిహారం ఇవ్వడంపై ఆలోచిస్తామన్నారు బొంతు. మేయర్ మాటలతో సుమేధ మృతిపై కొత్త అనుమానాలు తలెత్తాయి. దీనిపై పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియనున్నాయి.