దుబ్బాక ఉప ఎన్నికలోనూ టార్గెట్ చంద్రబాబు !?
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తెరాస ప్రచారం మాత్రం తెదేపా అధినేత చంద్రబాబుని టార్గెట్ గా చేసుకోవడం సాధారణంగా మారింది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెరాస అధినేత కేసీఆర్ చంద్రబాబుని ఓ రేంజ్ లో టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలోనూ తెరాస చంద్రబాబుని టార్గెట్ చేసినట్టు కనబడుతోంది.
దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు బాధ్యతని మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. దుబ్బాకని అభివృద్ది చేసే బాధ్యత నాదే అంటూ ఎన్నికల ప్రచారంలోకి దూకేశారు హరీష్. దుబ్బాకలో తెరాస ఘన విజయం ఖాయం. రెండు, మూడు స్థానాల్లో కాంగ్రెస్, భాజాపా ఎవరు నిలుస్తారన్నది తేల్చడానికే ఈ ఉప ఎన్నికల అన్నారు. గెలుపుపై అంత ధీమాగా ఉన్న హరీష్.. ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబు ప్రస్తావన తీసుకురావడం విశేషం.
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ బిల్లుకు సంబంధించి బీజేపీపై విమర్శలు గుప్పించిన హరీశ్‌రావు.. ఇలా చేసినందుకే గతంలో చంద్రబాబును తెలంగాణ ప్రజలు తరిమికొట్టారని అన్నారు. వ్యవసాయ బావులు, బోరు మోటార్లకు కరెంట్ మీటర్లు పెట్టాలనుకున్న చంద్రబాబుకే తెలంగాణ ప్రజలు మీటర్లు పెట్టి ఆంధ్రకు తరిమికొట్టారని.. దేశంలో వ్యవసాయానికి కరెంట్ మీటర్లు పెట్టాలనుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజలు అలాగే మీటర్లు పెట్టాలని హరీష్ పిలుపునిచ్చారు.