అమ్మాయిలకి పూరి గొప్ప సూచనలు
దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో పలు అంశాల గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘అమ్మాయిలు’ ఎలా ఆలోచిస్తారు, జీవిత భాగస్వామి విషయంలో వారి అంచనాలేంటి తదితర విషయాల గురించి ముచ్చటించారు. ‘పాపం అబ్బాయిలు పక్కింటి అమ్మాయిలతో సర్దుకుపోతారు. కానీ వీళ్లకి పక్కింటి అబ్బాయిలు సరిపోరు. ఎప్పుడూ సినిమా హీరోలే కావాలి. సిక్స్‌ప్యాక్ ఉండాలి, ఆరడుగులు ఉండాలి. ప్రపంచమంతా వాడిని చూసి భయపడాలి. అలాంటి వాడు రాత్రి వీళ్ల కాళ్లుపట్టాలి. దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు’ అని చెప్పిన పూరి.. జీవిత భాగస్వామిని ఎంచుకొనేందుకు అమ్మాయిలకు పూరి కొన్ని సలహాలు, సూచనలు చేశారు.
‘ఈ కాలం అమ్మాయిలకు నేను చెబుతున్నా.. సిక్స్‌ప్యాక్ కోసం వెతకొద్దు, ధనవంతుడి కోసం ఎదురుచూడొద్దు. ఈ మగ ఎదవలు ఎలా ఆలోచిస్తున్నారో గమనించండి. వాళ్లతో పోటీ పడండి. బాగా చదివి ఉద్యోగమో, వ్యాపారమో మొదలు పెట్టండి. స్వేచ్ఛగా ఎదగండి. ఇవన్నీ ఉంటే మగ తోడు అవసరం ఉండదు. మీ కాళ్లపై మీరు నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి. మీరు చెప్పే ప్రతి మాట వినే భర్త వద్దు, అసలు మాట వినని వెదవ కూడా మనకొద్దు. కొంచెం విని, కొంచెం వినని వ్యక్తిని చేసుకోండి. మీ మూడ్ బాగోలేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు సూచనలు ఇచ్చేవాడై ఉండాలి. కొంచెం మంచోడు, సీరియస్‌గా పనిచేసుకునేవాడైతే సరిపోతుంది. నువ్వు రాకుమారివి కాదు, మనకు మాహిష్మతి సామ్రాజ్యం వద్దు, బాహుబలి అసలు వద్దు. ఈ మాట గుర్తుపెట్టుకోండి’ అని పూరీ చెప్పుకొచ్చారు.